10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం పీకిండ్రు. బీజేపీకి ఎంపీ వంశీకృష్ణ సవాల్
మంచిర్యాల బీజేపీ నాయకుడు రఘుపై తీవ్ర విమర్శలు
మంచిర్యాల, జూన్ 5:STJ న్యూస్ ఛానల్
కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల అభివృద్ధికి ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. మంచిర్యాల బీజేపీ నాయకుడు రఘు చేస్తున్న విమర్శలకు స్పందిస్తూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
"కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ప్రాజెక్టులు, నిధులు ఏమిటో ప్రజలకు చెప్పండి. అభివృద్ధి గురించి మాట్లాడే ముందు మీ పనితీరు గురించి సమాధానం చెప్పాలి" అని ఎంపీ ప్రశ్నించారు.
తాను పార్లమెంట్‌లో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆమోదం పొందుతున్న ప్రాజెక్టులు తమ నిరంతర కృషి, ఫాలోఅప్ ఫలితమేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకులు గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తించి ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, ఆ ఆదరణను చూసి కొందరు బీజేపీ నాయకులు అసహనానికి గురవుతున్నారని విమర్శించారు. అభివృద్ధి కోసం పనిచేయకుండా కేవలం ప్రెస్ నోట్లు విడుదల చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
"దమ్ముంటే ఒక ఎన్నిక గెలిచి చూపించండి.. ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చి చూపించండి.. ఆ తర్వాత విమర్శలు చేయండి" అంటూ బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు.
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీ నాయకులను హెచ్చరించారు.

0 Comments