సర్పంచ్లకు సర్కారు బడుల బాధ్యత
ప్రభుత్వం తాజా నిర్ణయం
దీనిపై సర్పంచులకు విద్యాశాఖ ప్రత్యేక వర్క్ షాప్
జిల్లా స్థాయిలో అవగాహన
సదస్సులు నిర్వహించాలని డీఈఓలకు ఆదేశం
హైదరాబాద్: 03/05/2026:(నేటి ఇజం)
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందు కు, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా కొత్తగా ఎన్నికైన సర్పంచుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని విద్యాశాఖ నిర్ణయిం చింది. వేసవి సెలవుల అనంతరం *జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభం* కానున్న నేపథ్యం లో, గ్రామాల్లో విద్యావ్యవస్థను పటిష్టం చేయ డంపై సర్పంచులకు ఒకరోజు ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.
జిల్లా స్థాయిలోనే శిక్షణ
జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ఈ వర్క్షాప్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. క్షేత్రస్థాయిలో పాఠశాలల నిర్వహణ, అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని భావిస్తున్న ప్రభుత్వం, వారి ద్వారా స్థానిక ప్రజలను బడికి చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శిక్షణలో ప్రభుత్వ విద్యా పథకాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. ఈ వర్క్షాప్లో సర్పంచులకు పలు కీలక కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా బడుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, కమిటీల పనితీరును వివరించనున్నారు. మౌలిక వసతులు, పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాల కల్పనలో స్థానిక సర్పంచుల బాధ్యతను గుర్తు చేయనున్నారు. కొత్తగా రూపుదిద్దుకుంటున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటివి వారికి వివరించనున్నారు. అంగన్వాడీల అనుసంధానం, పాఠశాలల్లో విద్యార్థులకు అంది స్తున్న అల్పాహార పథకం అమలు తీరుతో పాటు బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ బడిలో చేర్పించడమే లక్ష్యంగా 'బడిబాట' కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు.
బడిబాటలో సర్పంచులే కీలకం
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు నిర్వహించే బడిబాట కార్యక్రమంలో సర్పంచులు క్రియాశీలక పాత్ర పోషించాలని విద్యాశాఖ కోరుతోంది. గ్రామంలో ఉన్న ప్రతీ బిడ్డ బడిలో ఉండేలా చూడటం, ప్రైవేటు పాఠశాలలకు దీటు గా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను వివరించడం వంటి అంశాలపై సర్పంచులకు ఈ వర్క్షాప్లో అవగాహన కల్పించనున్నారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వ బడులపై ప్రజల్లో నమ్మకం పెంచి, విద్యావ్యవస్థలో కొత్త ఉత్సవాన్ని నింపాలని ప్రభుత్వం భావిస్తోంది.komuraiahramadugu12@gmail.com
komuraiahramadugu12@gmail.com
రామడుగు కొమురయ్య ఎడిటర్



0 Comments