మంచిర్యాల మున్సిపల్ ఆరవ డివిజన్ నుండి జనసేన అభ్యర్థిని కుమ్మరి హర్షితకు బ్రహ్మరథం పడుతున్న డివిజన్ ప్రజలు

 

నేటి ఇజం: శ్రీరాంపూర్: 5:2:2026

మంచిర్యాల మున్సిపల్ ఆరవ డివిజన్ నుండి జనసేన అభ్యర్థిని కుమ్మరి హర్షితకు బ్రహ్మరథం పడుతున్న డివిజన్ ప్రజలు

మంచిర్యాల  కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్‌లో జనసేన పార్టీ తరుపున కార్పొరేటర్ అభ్యర్థిగా కుమ్మరి హర్షిత బరిలోకి దిగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల ప్రచారంలో హర్షిత గట్టి స్వరంతో ప్రజల ముందుకు రావడంతో డివిజన్‌లో మార్పు గాలులు వీయడం మొదలైంది.

ప్రచార కార్యక్రమంలో హర్షిత మాట్లాడుతూ, “యువతకు అవకాశం ఇవ్వండి… ప్రజల తరుపున ప్రశ్నించే ధైర్యమైన గొంతుగా నిలుస్తా” అంటూ తన రాజకీయ పోరాటానికి స్పష్టమైన దిశను ప్రకటించారు. మాటలకే పరిమితమైన రాజకీయాలు కాదు, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే నాయకత్వం అవసరమని ఆమె స్పష్టం చేశారు.

డివిజన్‌లో ఏళ్ల తరబడి పరిష్కారం కాని డ్రైనేజీ సమస్యలు, వెలుగులు లేని వీధిదీపాలు, తాగునీటి కొరత, గుంతలతో నిండిన రోడ్లపై హర్షిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రజలను పట్టించుకోని పాలకులపై ఆమె విమర్శల వర్షం కురిపించారు.

“కార్యాలయాల చుట్టూ తిరిగే నాయకత్వం కాదు… ప్రజల మధ్యే ఉండే నాయకత్వం జనసేనది. ప్రతి రోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు తెలుసుకుంటా, పరిష్కారం కోసం పోరాడతా” అని హర్షిత హామీ ఇచ్చారు.

“ప్రజల సమస్యలే నా ఎజెండా. మాటల రాజకీయాలు కాదు… పని చేసే రాజకీయాలు కావాలి. గెలిస్తే 6వ డివిజన్‌లో పెండింగ్ సమస్యల పరిష్కారమే నా మొదటి ప్రాధాన్యం” అని ఆమె ధీమా ప్రకటించారు.

హర్షిత దూకుడు ప్రచారానికి యువత, మహిళలు, కాలనీవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యువతలో ఆమెపై నమ్మకం పెరుగుతుండగా, ఈసారి 6వ డివిజన్‌లో మార్పు ఖాయమనే అభిప్రాయం ప్రజల్లో వినిపిస్తోంది.

జనసేన పార్టీ తరుపున కుమ్మరి హర్షిత చేపడుతున్న దూకుడు ప్రచారం డివిజన్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ, ప్రత్యర్థి వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది. మంచిర్యాల మున్సిపాలిటీ రాజకీయాల్లో 6వ డివిజన్ కీలకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment

0 Comments