ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి:

మంచిర్యాలజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల:జూన్ 20/06/2026:(నేటి ఇజం)

విద్యావ్యవస్థ బలోపేతం దిశగా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ తో కలిసి విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాసంస్థల అభివృద్ధి దిశగా అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహరీ గోడ, అదనపు గదులు ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో విద్యా సంవత్సరం ప్రారంభమైనందున జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని కస్తూరిబా గాంధీ విద్యాలయాలలో అదనపు తరగతి గదులు, భోజనశాలల నిర్మాణ పనులను చేపట్టి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, విద్యాలయాలలో అధిక మొత్తంలో అడ్మిషన్లు కల్పించి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. 200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించడం జరుగుతుందని, విద్యాశాఖ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, ప్రభుత్వ పాఠశాలలలో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి విద్యార్థులు పాఠశాలకు వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు. నాణ్యమైన విద్య అందించడంలో మంచిర్యాల జిల్లా 3వ స్థానంలో ఉందని, అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం విద్యారంగంతో పాటు వైద్య రంగ అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, మాతా శిశు ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రామడుగు కొమురయ్య ఎడిటర్
నేటి ఇజం దినపత్రిక