రామగుండం పోలీస్ కమిషనరేట్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనం పై నిషేధం కొనసాగింపు అనుమతి లేని డ్రోన్లు డిజె సౌండ్స్ పై కఠిన చర్యలు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ .


 *రామగుండం పోలీస్ కమిషనరేట్*



తేదీ : 03-02-2026/నే టి ఇజం


*బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు*


*అనుమతి లేని డ్రోన్‌లు,డీజే సౌండ్స్‌పై కఠిన చర్యలు*


*రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*


సాధారణ పౌరులు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల,పెద్దపల్లి జోన్‌లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారు ఒక ప్రకటనలో తెలిపారు.


బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.మద్యం మత్తులో వీధులు, రోడ్లపై అసభ్య పదజాలంతో మాట్లాడడం వల్ల అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని,ఈ పరిస్థితులకు కళ్లెం వేసి ప్రజల భద్రతను పరిరక్షించేందుకు నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు.


*ఈ నిషేధాజ్ఞలు 01-02-2026 నుండి 01-03-2026 వరకు* అమలులో ఉంటాయని, పరిస్థితులను బట్టి ఈ కాలపరిమితిని మరింత పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ గారు హెచ్చరించారు.


*డీజే, డ్రోన్‌లపై నిషేధాజ్ఞల పొడిగింపు*


రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల,పెద్దపల్లి జోన్‌లలో డీజే సౌండ్స్ వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.


చిన్నపిల్లలు,వృద్ధులు, రోగులు,విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా మరియు శబ్ద కాలుష్యం నివారించేందుకు భారీ శబ్దంతో కూడిన డీజే సౌండ్స్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు.


వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజల సమీకరణ,ప్రదర్శనల కోసం డీజే సౌండ్స్ వినియోగిస్తున్నారని, అయితే కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. ఏ ప్రాంతంలో ఎంత స్థాయిలో మైక్ సెట్ వినియోగించాలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు.


*ఈ నిషేధాజ్ఞలు కూడా 01-02-2026 నుండి 01-03-2026 వరకు* అమలులో ఉంటాయని, పరిస్థితులను బట్టి కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



*రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు*


రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో రామగుండం పోలీస్ కమిషనరేట్ యాక్ట్ 7(1), 2016, యాక్ట్ 22(1)(a) నుండి (f), 22(2)(a) & (b), 22(3), సిటీ పోలీస్ యాక్ట్ 1348 నం. IX ఫసలీ,సెక్షన్ 30, పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం 01-02-2026 ఉదయం 6:00 గంటల నుండి 01-03-2026 ఉదయం 6:00 గంటల వరకు అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.


ఈ కాలంలో రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు,సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.ఈ తరహా కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.


బంద్‌ల పేరిట వివిధ కారణాలు చూపుతూ సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయించేందుకు ఒత్తిడి చేయడం, బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసు శాఖకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని పోలీస్ కమిషనర్ గారు కోరారు.

Post a Comment

0 Comments