తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: పాఠశాల విద్యలోకి ఇంటర్... రద్దు కానున్న ఇంటర్ బోర్డు, నేడో రేపో ఆర్డినెన్స్ జారీ
హైదరాబాద్: మే 8/26:(నేతి ఇజం)
_తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది.పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు మెుదలు పెట్టింది.జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా స్కూల్ విద్యను 12వ తరగతి వరకు ఒకే వ్యవస్థలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది._
_పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి 2026-27 విద్యాసంవత్సరం నుంచే 11 తరగతి బోధన ప్రారంభిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కొత్త విద్యావిధానం అమలులోకి వస్తే పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇకపై జూనియర్ కాలేజీలకు వెళ్లకుండా అదే పాఠశాలలో 11 వ తరగతి(ప్లస్ టూ ఎడ్యుకేషన్ సిస్టమ్)చదవనున్నారు. ఈ విధానం సక్సెస్ అయితే తెలంగాణలో పాఠశాల, ఇంటర్ విద్యకు ఒకే బోర్డు ఏండనుంది.ఇంకా చెప్పాలంటే ఇంటర్ బోర్డు విలీనం కానుంది అని తెలుస్తోంది. ఇకపోతే రాష్ట్రంలో ప్లస్ టూ విద్యావిధానం అమలుకు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది._
_తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుగా నామకరణం?_
_తెలంగాణలో ఇంటర్ విద్య పాఠశాల విద్యలోకి విలీనం కానుంది. ఇంటర్‌ను పాఠశాల విద్యలోకి విలీనం చేస్తే ఇంటర్ బోర్డు రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై పాఠశాల, ఇంటర్ విద్యకు ఒకటే పరీక్షల బోర్డు ఉండే అవకాశం ఉది. నూతన విద్యాసంవత్సరం (2026-27) మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ విలీనంపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. అటు ఎస్ఎస్‌సీ బోర్డు ఇటు ఇంటర్ బోర్డు రెండింటికి వేర్వేరు చట్టాలున్న కారణంగా వాటిని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడో రేపో ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ ఇన్‌ఛార్జి సెక్రటరీ శ్రీదేవసేన సమక్షంలో పాఠశాల, ఇంటర్ విద్యాశాఖ అధికారులు గురువారం సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి బోర్డుకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (టీజీఎస్‌ఈబీ)గా నామకరణం చేస్తామని డిసెంబరులో విడుదల చేసినటువంటి రైజింగ్ తెలంగాణ దార్శనిక డాక్యుమెంట్‌లో ప్రభుత్వం స్పష్టం చేసిన అంశంపై మరోసారి చర్చించారు._
_కామన్ బోర్డు ఏర్పాటు చేసే ఛాన్స్_
_పాఠశాల విద్యలోకి ఇంటర్ విద్యను విలీనం చేయాలంటే ఆ రెండు చట్టాలను కలిపి ఒక కొత్త చట్టాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా పాఠశాల విద్యకు సంబంధించి తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్టు (1982) సవరించాల్సి ఉంది. అలాగే ఇటర్ విద్యకు సంబంధించి తెలంగాణ ఇంటర్‌మీడియట్ విద్యా చట్టాన్ని (1971) రద్దు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం విలీన ప్రక్రియపై కసరత్తు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్‌ఎస్‌సీ బోర్డు), ఇంటర్‌మీడియట్ విద్యామండలి (ఇంటర్‌బోర్డు)ని కలిపి ఒకే ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసే అవకాశం ఉంది.అటు కేంద్ర విద్యాశాఖ సైతం ప్రతి రాష్ట్రంలో పది, ఇంటర్‌కు ఒకే బోర్డు ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో పాఠశాల విద్యలోకి ఇంటర్ విద్యను విలీనం చేసే ప్రక్రియలో దూకుడు పెంచింది._
_విలీనంతో ప్రయోజనాలు ఇవే_
_ఇదిలా ఉంటే ప్రతీ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులు పదోతరగతి ఉత్తీర్ణులు అవుతున్నారు. వీరిలో దాదాపు చాలా మంది విద్యకు దూరం అవుతున్నారు. ఇంటర్, తత్సమాన విద్యలో చేరకుండా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం సొంత గ్రామాల్లో ఏదోఒక పనిచేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు పైచదువులకు దూరం అవుతున్నారు.ఈ క్రమంలో ఆ డ్రాపౌట్స్ తగ్గించాలంటే పాఠశాల విద్య పరిధిలోకి ఇంటర్ తీసుకురావడం మంచిదనే అభిప్రాయం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.అంతేకాదు పాఠశాల విద్యలోకి ఇంటర్‌ను విలీనం చేస్తే సమగ్ర శిక్షా, పీఎం శ్రీ తదితర పథకాల కింద మరిన్ని నిధులు పొందే అవకాశం ఉంటుందని అలాగే మౌలిక సదుపాయాలను పెంచుకోవచ్చు అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతీ స్కూల్‌లో పూర్తిస్థాయి ల్యాబ్‌లు ఉండాలని స్పష్టం చేస్తోంది. అయితే జూనియర్ కాలేజీల్లో సైన్స్ ల్యాబ్‌లు ఉన్నాయి కానీ పాఠశాలలకు లేవు. ఇప్పుడు ఈ రెండింటిని కలపడం వల్ల వేర్వేరు ల్యాబ్‌లు ఉండాల్సిన అవసరం లేదు. లైబ్రరీలను, ఇతర సౌకర్యాలను సమర్థంగా వాడుకునే అవకాశం ఉంది. పాఠశాల, ఇంటర్‌కు ఒకే టీచర్లు ఉండటం కారణంగా వారి బోధనకు విద్యార్థులు అలవాటుపడే అవకాశం ఉంది. అంతేకాదు ఏ విద్యార్థి విద్యా సామర్థ్యం ఏమిటో టీచర్లకు మరింత ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది._
_ఇంటర్ ప్రవేశాలకు బ్రేక్_
_పాఠశాల విద్యలోక ఇంటర్ విద్యను విలీనం చేసే ప్రక్రియకను కసరత్తు చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో జరగాల్సిన అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. వాస్తవానికి మే 8వ తేదీ నుంచి వచ్చే విద్యా సంవత్సరానికి (2026-27) సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సర అడ్మిషన్లు మొదలు కావాల్సి ఉంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ షెడ్యూల్ జారీ చేశారు. విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని... జూన్ 1వ తేదీ నుంచి తరగతులు_ _ప్రారంభమవుతాయని, తొలి విడత అడ్మిషన్లు జూన్ 30వ తేదీకి ముగుస్తాయని పేర్కొన్నారు.అయితే విలీన ప్రక్రియ శరవేగంగా జరుగుతుండటంతో ఆ ఆదేశాలను నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ప్రవేశాలు చేపట్టవద్దని పేర్కొన్నారు. ఇంటర్ విద్యలో కొన్ని సంస్కరణలు అమలు చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.komuraiahramadugu12@gmail.com
komuraiahramadugu12@gmail.com
రామడుగు కొమురయ్య ఎడిటర్
నేటి ఇజం



0 Comments